Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

అనాధల అవసరాలు

ఆలయ నిర్మాణం ద్రావిడదేశానికే ఒక ప్రత్యేకత అని చెప్పవలసి ఉంటుంది. ప్రతిగ్రామములోను ఎక్కడపడితే అక్కడ ద్రౌపది అమ్మవారు. ధర్మరాజు, వినాయకుడు, మురుగన్‌ అనే పేరుతో పిలువబడే సుబ్రహ్మణ్యశ్వరుడు, అయ్యనార్‌ లేక శాస్త్ర మొదలైన దైవములను ఉద్దేశించి కట్టిన ఆలయములు అసంఖ్యాకంగా ఉన్నాయి. వీనితో బాటు ప్రతిగ్రామములోను ఆ గ్రామదేవతలకై కట్టిన దేవస్థానాలు కూడ ఉన్నాయి. ఎన్నో కారణాలచేత ఈ మధ్య ఆలయాల నిర్వహణ సక్రమంగా జరుగుటలేదు. ఇది విచారకరమైన విషయం.

ఈ ఆలయాలతోబాటు ఈ మధ్య దాదాపు అన్ని ఊళ్ళలోను భజనసంఘాలను ప్రజలు లేవదీశారు. ఒక్కచెన్నపురిలోనే ఎన్నో భజనసంఘాలున్నాయి. ఈ సంఘాలు సక్రమంగా నడుస్తూ ఉండుట సంతోషకరం. ఐతే ఈ భజనసంఘాలు ఒక్క భజనలేకాక ఇతరవిధములైన సామూహిక సేవలలో కూడ పాల్గొనుట ఎంతైన అవసరము. ఈ భజనసంఘాలలోని సభ్యులలో కొందరకు సంగీతములో ప్రవేశము లేకపోవచ్చు. కాని ఏదో ఒకవిధమైన సమాజసేవలో పాల్గొందామన్న ఉత్సాహం ఉండవచ్చు. అందుచే అట్టివారి ఉత్సాహాలను వినియోగం చేసుకొనే అవకాశాలను ఈ సంఘాలు కల్పిస్తే బాగుంటుంది. ఒక్క భజననే సంపూర్ణ లక్ష్యంగా ఉంచుకోక తమ కార్యరంగాన్ని మరింత విస్తరింపజేసి సమాజసేవలో కూడ తరుచు వీరు శ్రద్ధ తీసుకొంటే బహుజనహితము, బహుజనసుఖము సిద్ధించగలవు.

ఒక ఉదాహరణ: కొన్ని కొన్ని సమయాలలో మనం వీథులలో వెడుతూఉంటే మనకంటికి దిక్కులేని అనాథశవాలు కనబడతాయి. ఈ అనాథశవాలు ఏ క్రైస్తవులకో ముస్లిములకో సంబంధించినవైతే ఆ జాతికి చేరిన చర్చిలు మసీదులు శ్రద్ధ వహించి వారి వారి మతానుసారంగా ప్రేతసంస్కారము చేయుటకు పూనుకొంటాయి. కాని హిందూమతానికి చెందిన శవాలు మాత్రము నిజముగా అనాథలై ఏవిధమైన రక్షణ లేని దౌర్భాగ్యస్థితిలో ఉండిపోతున్నాయి. హిందూమతానుసారం ఈ అనాథశవ సంస్కారానికి పూనుకొనే సంఘాలు ఏ వీ ఉన్నట్లు కనుపించదు. ఇది చాల శోచనీయమైన విషయం. ఒక్కొక్క నగరములోను, ఒక్కొక్క గ్రామములోను భజనసంఘా లేవైనా ఉంటే ఈ అనాథశవాల విషయం గమనించదగినది. ఈ విషయంగా చేసే సేవ అమూల్యమైన సామూహిక సేవ-ఇదేకాక ఈభజనసంఘాలు శవసంస్కారానికి కూడ డబ్బు లేక దారిద్ర్యముతో బాధ పడుతూ ఉన్న జనులకు ద్రవ్యసహాయమో దేహసహాయమో చేయవచ్చు. ఈసంఘాలు ఆసుపత్రులలోను, జైళ్ళలోను అకస్మాత్తుగా చనిపోయిన అనాథశవాల విషయము కూడ గమనించవచ్చు.

( 6 - 11 )

పైన చెప్పినవే కాక భజనసంఘాలు మరికొన్ని మార్గాలలో కూడ సమాజసేవ చేయవచ్చు. జైళ్ళలో ఖైదీలున్నారు. వైద్యాలయాలలో రోగులున్నారు. సుఖంగా శాంతంగా ఉన్నవారికంటె వీరికి మతం మిక్కిలి అవసరం. ఇప్పుడు జైళ్ళలో ఆ యా మతాలవారు అంటే-హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు వారివారి మతానుసారము ప్రవచనాలు చేయవచ్చునని అనుమతి ఉన్నది. ఇతరమతాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూఉంటే, ఒక్క హిందువులే ఈ విషయములో జాగ్రత్తపడుట లేదు. ఈలోపమును మనము నివారించాలి. మహాత్ముల బోధనలనో, జీవితచరిత్రలనో, పుణ్యకథలనో చిన్న చిన్న పుస్తకములుగా పత్రికలుగా అచ్చొత్తించి వీరికి పంచిపెడితే, నైరాశ్యముతో క్రుంగిపోయిన ఈఅభాగ్యజీవులకు ఉత్తేజకరముగా ప్రోత్సాహకరముగా ఉంటుంది. జైళ్ళలో వీనితో బాటు కథాకాలక్షేపములు కూడ ఏర్పాటు చేయవచ్చు. ఈ సేవ మూలంగా నూటికి ఒక్కడైనా సంస్కరింపబడితే చాలు. అది సమాజానికి ఎంతో మేలు చేకూర్చినట్లు అవుతుంది. ఇట్టి కార్యాలు సమాజములో కాలకర్మవశాన దుస్థ్సితిలో ఉన్నవారికి మనము చూపే సానుభూతికి చిహ్నములై ఉంటాయి. వారికి తాము అనాథుల మన్న భావం తొలగిపోయి సమాజం తమ్మునిరాదరణ చేయుట లేదని, తాము సమాజముయొక్క దృష్టిలోనుండి తొలగిపోలేదని గుర్తిస్తారు.

కొందరు దీర్ఘకాలపు రోగాలతో బాధపడుతూ నెలల తరబడి ఆసుపత్రులలో ఉండవలసి ఉంటుంది. అటువంటివారి యోగక్షేమార్థమై ఈ సంఘాలు ఏదైన దాపున ఉన్న సుప్రసిద్ధ క్షేత్రాలలో కైంకర్యముచేసి భగవత్ర్పసాదాన్ని వారికి అందజేయవచ్చు. నిరుత్సాహముతో క్రుంగిపోయిన వారి శ్రద్ధాభక్తులు కలిగేవిధముగా వ్రాయబడిన ప్రత్యేకములైన పుస్తకాలుకాని, కరపత్రాలుకాని అందజేయవచ్చు. ఒక వేళ రోగాలకు లొంగి వారు చనిపోయినా చరమకాలములో భగవత్స్మరణతో ప్రాణములు వదలిన పుణ్యము వారికి ఉంటుంది.

పైన చెప్పిన మార్గాలలో మనము కొంత పురోగ మింపగలిగితే తరువాత పాఠశాలలో మతవిషయిక బోధనలను గూర్చి ప్రయత్నము చేయవచ్చును. మన ప్రభుత్వము స్వేచ్ఛపై 'సెక్యులరిజం'ను పాటిస్తూ ఉన్నది. అందుచేత ప్రభుత్వపు బడులలో మతవిషయమైన బోధనలకు శిక్షాపథకమునుందు తావులేకున్నది. కాని క్రైస్తవ మిషనుకు చేరిన స్కూళ్ళలో మతం బోధిస్తూనే ఉన్నారు. ఈ పద్ధతివలన మనపిల్లలకు తమ విషయమై ఏవిధమైన శిక్షణ, పరిజ్ఞానము కలుగుటలేదు. వారికి తమ మతాచారాలను గురించి తెలుసుకొనే అవకాశము కూడ లభించుటలేదు. మతాంతరమును స్వీకరించే సంఖ్యహిందువులలోనే ఎక్కువకనబడుతూఉన్నది. అంటే ఇతరులను అనవలసిన పనియేమున్నది? మనమే నిందనీయులము. మన ఇల్లు మనము చక్కబెట్టుకుంటే, వైదిక మతమునకు ఆచరణ ఉన్నదని మనము ఋజువు పరచగలిగితే, మనమతం అనాథకాదు. దానిని ఆదరించి ఆదుకొనే వారున్నారని మనం మన ప్రవర్తనలో దాటగలిగితే ఇతరులలో పరివర్తనము ఎందుకు రాదు? పైగా మతాంతరము స్వీకరించిన వారుకూడ మన మతములోనికి వచ్చే అవకాశము ఉంటుంది. భజనసంఘాలు ఒక్క భజనలను మాత్రమేకాక తమ కార్యక్రమములో పైన చెప్పినవానికి కూడ అవకాశము కలిగిస్తే మామతంలో చేరండి, మామతం గొప్పది' అని నచ్చజెప్పేవారినినిరోధించే కంచలవలె ఉపయోగపడతాయి. అప్పుడు మన మతము పటిష్ఠ మగుటయే కాక మన మతమును ఆత్మగౌరవముతో అనుసంధానించే సులువు ఏర్పడుతుంది. ఇటువంటి సంఘాలలో సభ్యత్వం సభ్యుల శక్తిసామార్థ్యాలు సమ్మతి, విరాళాలపై ఆధారపడవలెనే కాని, ఒకజాతికో, ఒక వర్ణస్థునికో మాత్రమే ప్రవేశము ఉండవలె నన్న నిర్బంధము ఉండరాదు. సమూహసేవలో అందరు వర్ణవ్యత్యాసము లేకుండ పాల్గొనాలి. ఊరకే మాటిమాటికి మతభేదము ఉండరాదని చేసే శుష్కోపన్యాసములవలన ప్రయోజనము ఉండదు. వానివలన సంఘమునందు ఉండే అంతరాలు పెరుగునే కాని తరుగవు. ఈ భేదము ద్రావిడదేశము నందున్న 'ఆర్యద్రావిడ వివాదము' వంటిదైనా కావచ్చు. లేక వేరే ఏదైనా కావచ్చు. ఇటువంటి స్థానిక మార్గదర్శక సంఘాలు ఒక్కొక్క ఊరియందు నెలకొల్పే పక్షములో లేదా ఇప్పటి భజన సంఘములు తమ కార్యక్రమముతో బాటు పైన చెప్పిన వానిని పాటించే పక్షములో కామకోటి మఠమువారికి వ్రాస్తే మఠము కోరినవారికి సంఘనియమములు, కార్యవిషయకములైన నిబంధనలు అందజేయగలదు. ప్రస్తుతము ఇట్టి సంఘములు దాదాపు నూటయేబది వరకు దక్షిణ దేశములో ఉన్నాయి. ఈ సంఘాలు హిందూమతంలో చేరిన అందరిని ఉద్దేశించినవై ఉండాలి. ఇందులో ధనికుడు, ధరిద్రుడు అన్న తరతమ భేదాలకు చోటీయరాదు. శ్రీమంతులు ద్రవ్యసహాయము చేయుటకు పూనుకొంటే ఇతరులు శ్రమదానము చేయుటకు పూనుకొనాలి.

ఇక వివాహముల విషయము. ఎత్తుకొంటే సాథారణంగా పెండ్లిండ్లకు మన ఇండ్లలో బంధువర్గము, స్నేహితులు చాల మంది హాజరవుతూ ఉంటారు. ఈఆచారము వాంఛనీయమే. అయితే పెండ్లికి ఎంత సంతోషముగా నలుగురము వచ్చి కలుసుకొంటామో అదేవిధముగా ఎక్కడైన ఎవరైన చనిపోయినప్పుడు కూడ సానుభూతిని చూపుటకు, చేతనైనసాయము చేయుటకు అందరము కలిసికొనే అలవాటు మనము నేర్చుకోవాలి. ఇది చాల అవసరమైన విషయము. ఈ కాలములో రోజుకు రోజు గడచుటయే దుర్ఘటంగా ఉన్నది. పెండ్లిండ్లలో జరిగే ఖర్చును గూర్చి తలచుటకూడ భయముగా ఉన్నది. వచ్చినవారి నందరను ఆదరించి తృప్తిపరచుట చాలకష్టమైన కార్యము. చాలమంది ఈ బాధపడలేక మారుమూల ఉన్న ఊళ్ళకు వెళ్ళి క్లుప్తంగా జరుపుకొందా మని అనుకొంటారుకూడ. అందుచేత పెండ్లిండ్లకు వెళ్ళె ప్రతి ఒక్కరు పెండ్లిపెద్దకు తాము ఇవ్వదలచుకొన్న బహుమతులను వస్తురూపములోకాక ద్రవ్వరూపములో ఇస్తే ఎంతో అనుకూలముగా ఉంటుంది. ఈ ద్రవ్యరూపమైన బహూకృతి ఒక సాంఘిక నియమముగా మనము ఆచరించుట ఉత్తమము ధనికులు, గొప్పవారు పలుకుబడి కలవారి ఇండ్లలో జరిగే వివాహములకు చాల విలువగల బహుమతు లిచ్చుట అలవాటు. ఈవిధానము మార్చుట చాల అవసరము. నిజమునకు బహుమతులు లేనివారికి ఇస్తే వారు ఎంతో కృతజ్ఞతా భావము ప్రకటిస్తారు. ఇటువంటి ద్రవ్యసహాయము ఒక అత్యుత్తమమైన సామూహిక సేవగా పరిగణించవచ్చు. అదేవిధముగా అంత్యకర్మల విషయము కూడ లేనివారికి సాయముచేయుట మన కనీసమైన ధర్మము. అట్టి సహాయము బీదవారికి అందుబాటులో ఉంటే ప్రేతకర్మలు శ్రద్ధతో చేయుటకు వీలు అవుతుంది.

ఇవి ఒకజాతి పరస్పరము చేసుకొనదగిన సహాయములు. ఇది అందరి క్షేమమును ఉద్దేశించి చేయదగినది. అప్పుడు మన మతమునకు పరమోద్దేశ##మైన

''సర్వేజనాః సుఖినో భవన్తు''

అన్న సూక్తిని పాటించిన వారము అవుతాము.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page